Perambadur: రాజీవ్ హత్య కేసులో దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేత!

  • తీర్పులో అన్ని అంశాలనూ చర్చించింది
  • మళ్లీ విచారణ చేపట్టబోం
  • దోషుల విడుదలకు ప్రభుత్వ నిర్ణయం

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో జరిగిన మానవ బాంబు దాడిలో రాజీవ్ గాంధీతో పాటు మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసులో దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌ను నేడు సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో అన్ని అంశాలనూ చర్చించినందున, దీనిపై మళ్లీ విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగొయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

2014లో నాటి జయలలిత ప్రభుత్వం రాజీవ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో రాజీవ్ హత్య కేసు ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారు సుప్రీంను ఆశ్రయించారు. తమిళనాడు మంత్రివర్గం గతేడాది సెప్టెంబర్ 9న ఈ కేసులోని దోషులను విడుదల చేయాలని గవర్నర్‌కు సిఫారసు చేసింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వ సిఫారసులను గవర్నర్ పక్కనబెట్టారు. ప్రస్తుతం సుప్రీం పిటిషన్‌ను కొట్టివేయడంతో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

More Telugu News