Chennai: మధురై ఆసుపత్రిలో ఆగిన విద్యుత్ సరఫరా.. వెంటిలేటర్‌పై ఉన్న ఐదుగురు రోగుల మృతి

  • చెన్నైలో బీభత్సం సృష్టించిన గాలివాన
  • విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం
  • రోగుల మృతికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి సంబంధం లేదంటున్న వైద్యులు

ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని మధురైలో ఉన్న రాజాజీ గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. అయితే, రోగులు పవర్ కట్ కారణంగా చనిపోలేదని, పరిస్థితి విషమించే చనిపోయారని ఆసుపత్రి డీన్ వనతి చెబుతుండగా, కరెంటు పోవడంతో వెంటిలేటర్లు పనిచేయడం మానేశాయని, వారి మృతికి అదే కారణమని మృతుల బంధువులు చెబుతున్నారు.  

మంగళవారం రాత్రి చెన్నైలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రాజాజీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని విద్యుత్ పరికరాలు పనిచేయడం మానేశాయి. అయితే, ఆసుపత్రిలో జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఐసీయూలోని వెంటిలేటర్లకు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అందులో చికిత్స పొందుతున్న ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, జనరేటర్ పనిచేయకపోయినా బ్యాటరీల ద్వారా వెంటిలేటర్లకు పవర్ సప్లై అయిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News