Police: వనస్థలిపురంలో చోరీకి ఉపయోగించిన ఆటోను గుర్తించిన పోలీసులు!

  • గంట ముందే రెక్కీ
  • పనామాలోని ఓ హోటల్‌లో భోజనం
  • దిల్‌సుఖ్‌నగర్ సమీపంలో ఆటో మారిన దొంగలు

వనస్థలిపురం పనామా కూడలి వద్ద జరిగిన భారీ చోరీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. సిబ్బందిని బురిడీ కొట్టించి రూ.58 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

ఈ క్రమంలో చోరీకి గంట ముందే రెక్కీ నిర్వహించిన దొంగలు, పనామాలోని ఓ హోటల్‌లో భోజనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. గంటపాటు ఇద్దరు వ్యక్తులు నాలుగైదు సార్లు అక్కడ తిరిగారని సమాచారం. వాహనం రాగానే సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చి డబ్బుతో ఓ ఆటోలో పరారైనట్టు సమాచారం. ఆ ఆటోను పురానాపూల్‌‌లో గుర్తించిన పోలీసులు డ్రైవర్‌ను విచారించారు.

ఈ మొత్తం చోరీ ఘటనలో ఐదు నుంచి ఏడుగురు పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆటోలో ముగ్గురు మాత్రమే వెళ్లగా, ఇంకొకరు రోడ్డు దాటి బస్సులో వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దిల్‌సుఖ్ నగర్ సమీపంలోకి వెళ్లగానే వేరే ఆటో మారినట్టు తెలుస్తోంది.

నగర శివారు నుంచి వీరు సిటీ లోపలికి డబ్బుతో ఎందుకు వెళ్లారు? చోరీకి ఆ ఏటిఎంనే ఎందుకు ఎంచుకున్నారు? వాహనం అక్కడికి వచ్చే సమాచారం వారికెలా తెలిసింది? అన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే ఇదంతా తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దర్యాప్తు అంతా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో జరుగుతోంది.

More Telugu News