నోబాల్ విషయంలో అంపైర్ తో కోహ్లీ గొడవ.. గది తలుపును బలంగా తన్నిన అంపైర్!

07-05-2019 Tue 10:05
  • యాదవ్ వేసిన బంతిని నోబాల్‌గా ప్రకటించిన అంపైర్ నిగెల్
  • రీప్లేలో నోబాల్ కాదని తేలిన వైనం
  • ఐదు వేలు చెల్లించిన అంపైర్ 

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-అంపైర్ నిగెల్ లాంగ్ మధ్య గొడవ జరిగింది. బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన 20వ ఓవర్‌లో ఓ బంతిని అంపైర్ నిగెల్ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే, టీవీ రీప్లేలో అది నోబాల్ కాదని తేలింది. అంపైర్ నిర్ణయంపై ఉమేశ్, కెప్టెన్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాగ్వివాదానికి దిగారు. అదేమీ పట్టించుకోని నిగెల్ వెళ్లి బంతి వేయాల్సిందిగా యాదవ్‌కు సూచించాడు.  

ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ అయిన నిగెల్ (50) సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం అంపైర్ రూములోకి వెళ్లాడు. విసురుగా అక్కడి గది తలుపును తన్నాడు. దీంతో అది కాస్తా ధ్వంసమైంది. అంపైర్ తీరును తీవ్రంగా పరిగణించిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) దీనిని క్రికెట్ పాలక మండలి (సీఓఏ) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాగా, ధ్వంసమైన తలుపు మరమ్మతుల కోసం అంపైర్ నిగెల్ రూ.5 వేలు చెల్లించినట్టు తెలుస్తోంది.