Hyderabad: 200 కోసం హత్య.. ఆటోడ్రైవర్ హత్య కేసులో వెలుగులోకి అసలు నిజం!

  • పహాడీషరీఫ్‌లో ఈ నెల 1న ఆటో డ్రైవర్ హత్య
  • ఐదు హత్య కేసుల్లో అనుమానితుడైన ఆదిల్ హస్తం ఉందని నిర్ధారణ
  • కత్తిని గొంతులో దించి హత్య

ఈ నెల 1న హైదరాబాద్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి పెద్ద చెరువు శివారులో జరిగిన హత్యకేసులో పోలీసులు పురోగతి  సాధించారు. ఐదు హత్య కేసుల్లో అనుమానితుడైన ఆదిల్ ముఠాతో ఈ హత్యకు సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు.

వారి కథనం ప్రకారం.. గత నెల 30న ఆదిల్ తన అనుచరులతో కలిసి తొలుత శేరిలింగంపల్లికి వెళ్లాడు. ఆ తర్వాత శేరిలింగంపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ సాయినాథ్‌(26)తో రూ.500 కిరాయికి మాట్లాడుకుని వారంతా రాజేంద్రనగర్‌ ఫిష్‌ బిల్డింగ్‌కు చేరుకున్నారు. అయితే, మాట్లాడుకున్న రూ.500 కాకుండా రూ.300 మాత్రమే డ్రైవర్ చేతిలో పెట్టడంతో మిగతా రెండు వందలు ఇవ్వాలని ఆటోడ్రైవర్ సాయినాథ్ వాగ్వివాదానికి దిగాడు.

రెండు వందల కోసం డ్రైవర్ పట్టుబట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆదిల్ జేబులోంచి కత్తితీసి గొంతులో పొడిచాడు. అనంతరం అతడి శవాన్ని అదే ఆటోలో తీసుకెళ్లి జల్‌పల్లి పెద్ద చెరువు సమీపంలోని  పొదల్లో పడేశారు. తర్వాత అదే ఆటోలో వెళ్లి శ్రీశైలంరోడ్డుపై ఓ హోటల్‌లో టీ తాగారు. ఆ తర్వాత మళ్లీ అనుమానం వచ్చి సాయినాథ్ బతికి ఉన్నాడేమోనని పొదల వద్దకు వచ్చి పరిశీలించారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక ఆటోలోని రక్తపు మరకలు శుభ్రం చేసి చింతల్‌మెట్‌లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి ఆటోను కాల్చేశారు.

సాయినాథ్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కుడి చేతిపై ఓ మహిళ పేరు ఉండడంతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉంటుందని భావించారు. అయితే, అదే సమయంలో చింతల్‌మెట్‌లో ఓ ఆటో కాలిపోయినట్లు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేసిన పోలీసులకు ఆటో సాయినాథ్‌దేనని గుర్తించారు. దీంతో మరో కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆదిల్‌పై అనుమానం మళ్లింది. ఆటో అద్దె విషయంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. త్వరలోనే ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News