chandrayan 2: చంద్రయాన్-2లో ఎన్నో క్లిష్టమైన అంశాలున్నాయి: ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్

  • జూలై 9 నుంచి 16 మధ్యలో చంద్రయాన్-2 ప్రయోగం
  • చంద్రుడి ఉపరితలంపై రోవర్ ను ల్యాండ్ చేయనున్న ఇస్రో
  • ఉపరితలంపై శాంపిల్స్ సేకరించనున్న రోవర్

భారత అంతరిక్ష రంగంలో త్వరలో చేపట్టబోతున్న చంద్రయాన్-2 ప్రయోగం అత్యంత ప్రధానమైనదని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ తెలిపారు. జూలై 9 - 16 మధ్యలో ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టబోతోంది.

ఈ సందర్భంగా ఎన్ఐఏతో నాయర్ మాట్లాడుతూ, భారత అంతరిక్ష పరిశోధలనకు సంబంధించి చంద్రయాన్-2 ఎంతో ఉత్కంఠను రేపుతోందని చెప్పారు. 2008లో చంద్రుడిపైకి మనం తొలి స్పేస్ క్రాఫ్ట్ ను విజయవంతంగా ప్రయోగించామని... చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని అది అందించిందని చెప్పారు.

అయితే, చంద్రయాన్-2 మిషన్ అత్యంత సంక్లిష్టంగా ఉంటుందని నాయర్ తెలిపారు. ఇప్పటికే సిస్టమ్ డెవలప్ మెంట్ పూర్తయిందని... మిషన్ కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై రోవర్ ను సురక్షితంగా దించాల్సి ఉంటుందని, ఆ తర్వాత 300 నుంచి 500 మీటర్ల మేర దాన్ని నడిపించాలని, ఉపరితలంపై ఉన్న శాంపిల్స్ ను సేకరించేలా చేయాలని అన్నారు.

జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ మార్క్3 (జీఎస్ఎల్వీఎంకే3) ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు నిన్న ఇస్రో ప్రకటించింది. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ను తనతో పాటు జీఎస్ఎల్వీఎంకే3 తీసుకెళుతుంది. సెప్టెంబర్ 6న మూన్ ల్యాండింగ్ జరగాలనే లక్ష్యంతో మిషన్ కొనసాగుతోంది.

More Telugu News