varanasi: నామినేషన్ల తిరస్కరణపై భగ్గుమన్న పసుపు రైతులు.. ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి

  • వారణాసిలో ప్రధాని మోదీపై పోటీకి 25 మంది నామినేషన్లు
  • ఇందులో 24 నామినేషన్లు తిరస్కరించిన అధికారులు
  • ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేసిన నిజామాబాద్‌ పసుపు రైతులు తమ నామినేషన్ల తిరస్కరణపై భగ్గుమన్నారు. పంటకు గిట్టుబాటు ధర, ఇతరత్రా అంశాల్లో అన్యాయంపై తమ నిరసనలో భాగంగా ఈ ప్రాంతానికి చెందిన 25 మంది రైతులు వారణాసిలో నామినేషన్‌ దాఖలు చేశారు.

వాస్తవానికి అరవై మంది రైతులు నామినేషన్లు వేసేందుకు వెళ్లినప్పటికీ ప్రతిపాదకులు లభించకుండా అడ్డుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో స్థానిక రైతు సంఘాల సాయంతో కేవలం 25 మంది మాత్రమే తమ నామినేషన్‌ పత్రాలు రిటర్నింగ్‌ అధికారికి అందించారు. వీరిలో 24 మంది నామినేషన్లను వేర్వేరు కారణాలతో రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. దీంతో వారణాసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన రైతులు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ ఫిర్యాదు అందించనున్నారు.

More Telugu News