Pakistan: ఇదేమీ 1971 కాదు... మా పొరుగుదేశం గుర్తుంచుకోవాలి!: పాకిస్థాన్

  • ఫస్తూన్ నిరసనలకు 'రా' నిధులు
  • పదేపదే అబద్ధాలు చెబుతున్న ఇండియా
  • పాక్ ఐఎస్పీఆర్ డీజీ ఆసిఫ్ గఫూర్

పాకిస్థాన్ గడ్డపై ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా లేదని పాకిస్థాన్ వెల్లడించింది. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పై నిషేధం విధించే దిశగా ఐరాస అడుగులు వేస్తున్న వేళ, పాక్ ఆర్మీ ప్రతినిధి ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారు. ఫస్తూన్ లో జరుగుతున్న నిరసనలకు భారత్ కు చెందిన రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) నిధులందిస్తోందని ఆరోపించిన ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ ఆసిఫ్ గఫూర్, గడచిన రెండు నెలలుగా ఇండియా పదేపదే అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. భారత్ చేసిన పనికి తాము గట్టి సమాధానమే చెప్పామని ఆయన అన్నారు.

"మా పొరుగున ఉన్న దేశం గుర్తుంచుకోవాలి. ఇదేమీ 1971 కాదు. తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా ఏర్పడ్డ కాలం కాదు. భారత్ కు ధైర్యముంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్ తరువాత ఏం జరిగిందో చెప్పాలి. మేము జరిపిన ప్రతి దాడిలో ఏం నష్టపోయారన్న విషయాన్ని ఇండియా ఇంతవరకూ ప్రకటించలేదు" అని గఫూర్ మండిపడ్డారు.

కాగా, పాక్ నేషనల్ కౌంటర్ టెర్రరిజమ్ అథారిటీ (నాక్టా) గడచిన మార్చిలో 69 ఉగ్ర సంస్థలను నిషేధించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అసలైన ఉగ్ర సంస్థలైన హిజ్బుల్ ముజాహిద్దీన్, హర్కత్ ఉల్ ముజాహిద్దీన్, అల్ బదర్ తదితరాలను మాత్రం విస్మరించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద సంస్థలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని భారత్ చెబుతున్నప్పటికీ, పాక్ ఈ తరహా తప్పుడు క్లయిమ్ లు చేసుకోవడం గమనార్హం.

More Telugu News