5 పైసలకే కిలోమీటర్... మార్కెట్లోకి రానున్న 'ప్యూర్ ఈవీ' బైక్ లు!
- తయారు చేసిన స్టార్టప్ సంస్థ ప్యూర్ ఈవీ
- 10 వేల వాహనాలను మార్కెట్లోకి తెస్తాం
- సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్
హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్, ముంబై ఐఐటీకి చెందిన రోహిత్ లు కలిసి 2016లో ఏర్పాటు చేసిన 'ప్యూర్ ఈవీ', ఈ కలల బైక్ ను కళ్ల ముందుంచింది. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో వీరు ఏర్పాటు చేసుకున్న రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ సమర్థవంతంగా పనిచేసే లీథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడం ద్వారా ఈ బైక్ కు కావాల్సిన ప్రధాన శక్తిని అందించింది.
కేవలం 45 కిలోల బరువుతో ఉండే ఈ ద్విచక్ర వాహనానికి 'ఈ-ట్రాన్స్' అని పేరు పెట్టారు. దీని ధర ఎంచుకునే మోడల్ ను బట్టి రూ. 30 వేల నుంచి రూ. 70 వేల వరకూ ఉంటుందని, మార్చి 2020లోగా 10 వేల వాహనాలను అందుబాటులో ఉంచుతామని సంస్థ ఫౌండర్ నిశాంత్ వెల్లడించారు. పూర్తి చార్జింగ్ కు కేవలం నాలుగు గంటల సమయం పడుతుందని, ఆపై 120 కిలోమీటర్లు ప్రయాణించ వచ్చని ఆయన అన్నారు.