Sri Lanka: ఉగ్రదాడుల ఎఫెక్ట్: ముఖం కప్పుకోవడాన్ని నిషేధించిన శ్రీలంక

  • నేటి నుంచే నిబంధనలు అమల్లోకి  
  • ఆదివారం బోసిపోయిన చర్చ్ లు
  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సోదాలు

ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ ముఖాలు కప్పుకోరాదని అధ్యక్ష కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖానికి ముసుగు ధరించడం ద్వారా తమ ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సోమవారం నుంచే ఈ నిబంధన వర్తిస్తుందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం పేర్కొంది. అత్యవసర నిబంధనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు ప్రజా రక్షణ కోసమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.

కాగా, దాడుల ప్రభావం ఈ ఆదివారం కూడా కనిపించింది. చర్చ్ లన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రార్థనల కోసం చర్చ్ లకు వచ్చేందుకు జనాలు భయపడ్డారు. కల్మునై, సమంథురై, చవలకడె ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ ఎవరూ చర్చ్ లవైపు రావడానికి సాహసించలేదు.

మరోవైపు అనుమానిత ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అహ్మద్ అనే అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు అతడి నుంచి ఉగ్ర సాహిత్యం, జర్మన్ తయారీ ఎయిర్‌గన్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News