Yanamala: తుపాను ఇటే వస్తుందంటున్నారు... ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పండి! సీఎస్సా, ఈసీనా, మోదీనా?: యనమల ఫైర్

  • అమరావతిలో మంత్రి మీడియా సమావేశం
  • సీఎస్ పై విమర్శలు
  • ఈసీపైనా విసుర్లు

ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తాజా పరిణామాలపై రాష్ట్ర రాజధాని అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘం, సీఎస్ ల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. పరిధికి మించి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వాన్ని సరిగా పనిచేయనివ్వడంలేదని ఆరోపించారు.

అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపైనే ఉంటుందని, అలాంటిది అడుగుడుగునా అడ్డు తగులుతున్నారంటూ సీఎస్ పై మండిపడ్డారు. ఈసీ అప్పగించిన పని ఏంటి? సీఎస్ చేస్తున్న పని ఏంటి? అని నిలదీశారు. సమీక్షలు చేయొద్దంటున్నారు, ఇప్పుడు తుపాను రాష్ట్రం దిశగా దూసుకువస్తోందంటున్నారు, రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పండి! సీఎస్సా, ఈసీనా, మోదీనా? అంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వం లేకుండా పాలన జరుగుతుందని ఎక్కడ, ఏ రాజ్యాంగంలో చెప్పారో చూపించాలని యనమల డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎక్కడైనా క్యాబినెట్ కార్యదర్శి జోక్యం చేసుకోవడం చూశారా? కానీ, మన రాష్ట్రంలో మాత్రం సీఎస్ జోక్యం చేసుకుంటారని విమర్శించారు. "ప్రజల హక్కులకు భంగం కలిగేలా ఎన్నికల సంఘం నియమావళి రూపొందించడం ఎక్కడైనా ఉందా?" అంటూ యనమల మండిపడ్డారు.

More Telugu News