Andhra Pradesh: విజయవాడలో రామ్ గోపాల్ వర్మ కారును అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లింపు!

  • విజయవాడకు చేరుకున్న ఆర్జీవీ
  • మీడియా సమావేశానికి వెళుతుండగా ఘటన
  • శాంతిభద్రతల కోసమేనంటున్న పోలీసులు

విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ లో మీడియా సమావేశం పెడతానన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురయింది. ఈ రోజు విమానంలో గన్నవరం చేరుకున్న వర్మ అక్కడి నుంచి విజయవాడలోని ప్రకాశ్ నగర్ కు వచ్చారు. అయితే, ఆయన వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. ‘విజయవాడలోకి మిమ్మల్ని అనుమతించలేం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దయచేసి వెనక్కి వెళ్లిపోండి’ అని కోరారు.

అయినా వర్మ వినకపోవడంతో ఓ పోలీస్ వాహనాన్ని ఎస్కార్ట్ గా ఇచ్చి బలవంతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు తిప్పిపంపారు. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వచ్చే నెల 1న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా వర్మ నోవాటెల్ హోటల్ ను బుక్ చేసుకున్నారు. అయితే అనివార్య కారణాలతో నోవాటెల్ యాజమాన్యం కార్యక్రమానికి అనుమతిని నిరాకరించింది.

ఈ నేపథ్యంలో నడిరోడ్డుపైనే మీడియా సమావేశం పెడతానని వర్మ హెచ్చరించారు. ఒకవేళ వర్మ నిజంగా సమావేశం పెడితే టీడీపీ శ్రేణులు అడ్డుకునే అవకాశముందనీ, దీనివల్ల గొడవలు జరగవచ్చని భావించిన పోలీసులు వర్మను గన్నవరం ఎయిర్ పోర్టుకు తిరిగిపంపినట్లు సమాచారం.

More Telugu News