Telangana: అధికారులు సతాయిస్తున్నరు నాయనా అని ఏడ్చిన నర్సమ్మ.. వెంటనే స్పందించిన కేటీఆర్!

  • తెలంగాణలోని సంగారెడ్డిలో ఘటన
  • కంది గ్రామంలో దళిత కుటుంబానికి ఇబ్బందులు
  • అధికారులు లంచం అడుగుతున్నారని నర్సమ్మ ఆవేదన

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పెద్దావిడ ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మొరపెట్టుకున్నారు. తన భూమికి పాస్ బుక్ ఇవ్వకుండా అధికారులు 2 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారని మల్లేపల్లి నర్సమ్మ(70) ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వీఆర్వో, ఎమ్మార్వోలు రూ.లక్ష లంచం ఇస్తేనే పాస్ బుక్ ఇస్తామని వేధిస్తున్నారని వాపోయారు. తమది మాదిగ కులం అని ఆఫీసు ముందుకు కూడా రానివ్వడం లేదనీ, న్యాయం చేయాలని కోరారు. మీరు ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని కన్నీరు పెట్టుకున్నారు. తమది సంగారెడ్డిలోని కంది గ్రామమని చెప్పారు.

‘నాయనా.. పాస్ బుక్కుల గురించి అధికారులు సతాయిస్తున్నరు. లక్ష రూపాయలు అడిగిండు. లక్ష రూపాయలు లేవంటే యాభై వేలు ఇమ్మన్నడు. యాడికెళ్లి ఈయాలే.. మేం ఎక్కడికి వెళ్లాలి నాయనా. నా ఇద్దరు బిడ్డలు, భర్త చచ్చిపోయిండు. మీరిచ్చిన పింఛన్ మీద బతుకుతున్నం కొడకా. ఇప్పుడు మేం ఏం చేయాలే.

మా పాస్ బుక్కులు మీరు పంపిస్తేనే బతుకుతం. లేదంటే మాకు చావే దిక్కు నాయనా’ అని చేతులు జోడించి ప్రార్థించారు. ఈ వీడియోను యాదగిరి అనే వ్యక్తి ట్విట్టర్ లో కేటీఆర్ కు ట్యాగ్ చేయగా, వెంటనే కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ఎం.హనుమంతరావును కోరారు.




More Telugu News