Telugudesam: చంద్రబాబు ఎవరితోనూ చెప్పించుకునే స్థితిలో లేరు... మీ కుట్రలు చాలించండి!: ప్రత్తిపాటి పుల్లారావు

  • సీఎస్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు
  • మోదీ, షా ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారు
  • సీఎస్ కుట్ర రాజకీయాలు మానుకోవాలి

ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాసంక్షేమమే పరమావధిగా ముందుకు వెళుతున్నారని, ఆయన ఎవరితోనూ చెప్పించుకునే స్థితిలో లేరని స్పష్టం చేశారు. సమీక్షల విషయంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో పుల్లారావు పైవ్యాఖ్యలు చేశారు.

సీఎస్ గా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం పరిధులను అతిక్రమించి నడుచుకుంటున్నారని, ఆయన కుట్ర రాజకీయాలకు స్వస్తి చెబితే మంచిదని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలపై ప్రశ్నించే అధికారం సీఎస్ కు లేదన్న విషయం ఎల్వీ సుబ్రహ్మణ్యం గుర్తెరగాలని హితవు పలికారు. క్యాబినెట్ ఆమోదం ఉన్న పథకాలను ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత సీఎస్ దేనని ఆయన స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షా కుట్రలో భాగంగానే ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ గా వచ్చారని, అందుకే వారి ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారని ప్రత్తిపాటి ఆరోపించారు.

వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తీసుకువచ్చారంటూ వ్యాఖ్యానించారు. మోదీ, షాల అండతో ఎల్వీ సుబ్రహ్మణ్యం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతున్న సమయంలో ప్రత్తిపాటి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

More Telugu News