Modi biopic: మోదీ బయోపిక్‌ నిర్మాతలకు ‘సుప్రీం’ షాక్‌.. మే 19 వరకు విడుదలకు నో

  • ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోమని స్పష్టీకరణ
  • చివరి విడత పోలింగ్‌ పూర్తయ్యాకే నిర్ణయం
  • నిర్మాతల పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం

ప్రధాని మోదీ బయోపిక్‌ నిర్మించిన వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు షాకిచ్చింది. చివరి విడత పోలింగ్‌ పూర్తయ్యే వరకు చిత్రం విడుదలకు నో చెప్పిన ఎన్నికల సంఘం ఆదేశాలను సమర్థించింది. ఎన్నికల సంఘం ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గొగోయ్‌ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

 వివరాల్లోకి వెళితే... ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించడంతో విపక్షాలు కోర్టుకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు మేరకు వివరాలు సమర్పించాలని ఈనెల 15వ తేదీన ఎన్నికల సంఘాన్ని ఎపెక్స్‌ కోర్టు ఆదేశించింది. ఈనెల 22న ఎన్నికల సంఘం తన నివేదిక అందించింది.

సినిమా ఓ పార్టీకి ప్రయోజనం కల్పించేలా ఉందని, అందువల్ల సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్‌ పూర్తయ్యే మే 19 వరకు విడుదలకు అంగీకరించకూడదని పేర్కొంది. దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈసీ నిర్ణయం సబబేనని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఈసీ చర్యల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న మోదీ బయోపిక్‌లో మోదీ పాత్రను వివేక్‌ ఒబెరాయ్‌ పోషించిన విషయం తెలిసిందే.

More Telugu News