Telangana: విద్యాశాఖ ప్రక్షాళనలో కేసీఆర్.. స్థానిక ఎన్నికల తర్వాత సంచలన నిర్ణయం

  • మళ్లీ పాత పద్ధతికే కేసీఆర్ జై
  • టీచర్ల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి గుర్రు
  • జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్‌లకే మళ్లీ అధికారాలు

ఇంటర్ బోర్డు తీరుతో అభాసుపాలైన ప్రభుత్వ ప్రతిష్ఠను తిరిగి గాడిలో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలలు, టీచర్ల వ్యవహారాలను స్థానిక సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు వ్యవహరించిన తీరుతో గుర్రుగా ఉన్న సీఎం.. టీచర్లు రాజకీయాల్లో వేలు పెట్టడం, రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడం, చిట్‌ఫండ్, వ్యాపారాలు నిర్వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు పనిచేసినట్టు కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించారని చెబుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయాన్నిఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి 1998 కంటే ముందు ప్రాథమిక విద్యను మండల ప్రజాపరిషత్ కమిటీ, ఆరు నుంచి పది వరకు జిల్లా పరిషత్‌లు చూసుకునేవి. పాఠశాలల నిర్వహణ, టీచర్ల నియామకాలు, బదిలీలు అన్నీ జిల్లా, మండల పరిషత్ అధీనంలో ఉండేవి. ఆ తర్వాత వీటిని డీఈవో పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో స్థానిక సంస్థలకే స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలనేది కేసీఆర్ యోచనగా చెబుతున్నారు. స్థానిక సంస్థల అధికారాల్లో విద్యారంగం కూడా ఉండడంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News