Inter: అతి త్వరలో తెలంగాణ టెన్త్ ఫలితాలు... అందరిలోనూ టెన్షన్!

  • ఇంటర్ పరీక్షల తరువాత గందరగోళం
  • టెన్త్ విషయంలోనూ అదే జరుగుతుందేమోనన్న అనుమానాలు
  • అర్హత లేని ఉపాధ్యాయులతో దిద్దిస్తున్నట్టు ఆరోపణలు
  • సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు

తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైన తరువాత నెలకొన్న గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపిన వేళ, త్వరలో విడుదల కానున్న టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మూల్యాంకనంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటర్ బోర్డ్ చేసిన తప్పులనే పాఠశాల విద్యాశాఖ కూడా చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

అర్హత లేని ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను దిద్దిస్తున్నారని, త్వరగా మూల్యాంకనం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరికీ రోజుకు 15 నుంచి 20 పేపర్లు అదనంగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు మాత్రం మూల్యాంకనం సాఫీగా సాగుతోందని, ఆసక్తి చూపుతున్న ఉపాధ్యాయులకు మాత్రమే అదనపు పేపర్లు ఇస్తున్నామని చెబుతుండటం గమనార్హం.

కాగా, ఇంటర్ ఫలితాల తరువాత నెలకొన్న పరిస్థితే, టెన్త్ తరువాత కూడా వస్తుందని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. 99 మార్కులు రావాల్సిన వారికి సున్నా రావచ్చని, లేదా 120 మార్కులైనా రావచ్చని, పాస్ అయితే ఫెయిల్ అని, ఫెయిలయిన వారు పాస్ అయినట్టు వచ్చినా ఆశ్చర్య పోవద్దని జోకులు వస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని, రీ కౌంటింగ్ కు, రీ వాల్యుయేషన్ కు డబ్బు కట్టి ఆదుకోవాలన్న సెటైర్లూ పడుతున్నాయి.

ఇదిలావుండగా, టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో ముగుస్తుందని తెలుస్తోంది. ఆ తరువాత ఫలితాలను క్రోఢీకరించి రిజల్ట్స్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 

More Telugu News