Andhra Pradesh: 48 గంటల్లోగా ఉద్యోగులకు క్షమాపణలు చెప్పండి!: 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్

  • రాధాకృష్ణ మాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు
  • దీన్ని చంద్రబాబు కూడా ఖండించాలి
  • విజయవాడలోని లెనిన్ సెంటర్ లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లెనిన్ సెంటర్ లో ఈరోజు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏబీఎన్ టీవీ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత వేమూరి రాధాకృష్ణ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే తమకు 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకుంటే తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ విషయమై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. చంద్రబాబుతో ఏబీఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ బయటకు చెప్పలేని రీతిలో ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలను ఖండించని చంద్రబాబు.. రాధాకృష్ణను సమర్థించే తీరులో మాట్లాడారు.

ఏపీలో అధికారులు, ఉద్యోగులు తమకు రాజకీయంగా అనుకూలంగా వ్యవహరించలేదన్న కారణంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నాం. ఈ ధోరణిని మేమంతా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఏబీఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరించాలని పిలుపునిస్తున్నాం’ అని చెప్పారు.

More Telugu News