CEO: సీఈఓ ద్వివేదిని కలిసిన వైసీపీ నేత నాగిరెడ్డి

  • ఈసీకి సమాధానాలు ఇచ్చినా మళ్లీ నోటీసులు
  • ఈ విషయమై ద్వివేదికి ఫిర్యాదు చేశాం
  • టీడీపీ కోవర్టులు ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారు

ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేదిని వైసీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి కలిశారు. ఈసీ నోటీసులకు సమాధానాలు ఇచ్చినా మళ్లీ నోటీసులు జారీ చేశారని ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, డిప్యుటేషన్ పై ఎన్నికల విధుల్లో నియమితులైన టీడీపీ కోవర్టులు ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు అవహేళన చేస్తున్నారని ఆరోపించారు.

 అమలులో ఉన్న ఎన్నికల కోడ్ ను టీడీపీ ఉల్లంఘించడంపై ఈసీకి తగిన ఆధారాలు అందజేశామని చెప్పారు. ఈసీ తమకు ఇచ్చిన అన్ని నోటీసులకు సమాధానాలు ఇచ్చామని తెలిపారు. అదే, ఈసీ ఇచ్చిన నోటీసుల్లో ఒక్క దానికీ టీడీపీ ఇంతవరకూ స్పందించలేదని విమర్శించారు.

ఇప్పటివరకూ ఎవరెకి ఎన్ని నోటీసులిచ్చారు? ఆ నోటీసులకు ఎవరెవరు సమాధానాలిచ్చారన్న విషయమై ఈసీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అనుకూల మీడియాకు ఈసీ తక్కువ నోటీసులు ఇచ్చిందని, ‘సాక్షి’కి మాత్రం ఎక్కువ నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ఈసీని చంద్రబాబు బెదిరించి తనకు అనుకూలంగా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. 

More Telugu News