Chandrababu: సీఎం తన క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటే తప్పేమిటి?: చంద్రబాబు ఫైర్

  • ప్రధాని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చా?
  • ఇంత చెత్త ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు
  • అధికారులకు శిక్షణ ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహించారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులు, ఇతర ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమరావతి వేదికగా జరిగిన ఈ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ఓ ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టుకుంటే తప్పేముంది? అని చంద్రబాబు ప్రశ్నించారు. మరి, ప్రధానమంత్రి మాత్రం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించుకోవచ్చా? అని నిలదీశారు. ఆయనకు నిబంధనలు వర్తించవా? అని అడిగారు.

ఏపీలో టీడీపీ 100 శాతం కాదు, 1000 శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్ర చరిత్రలో ఇంత చెత్త ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, అధికారులకు శిక్షణ ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహించి అప్రదిష్ఠపాలయ్యారని విమర్శించారు. ఎన్నికల తర్వాత కూడా అసంబద్ధ నిర్ణయాలతో ఎన్నికల సంఘం అభాసుపాలవుతోందని విమర్శించారు.   ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని జూన్ 8 వరకు టీడీపీ ప్రభుత్వమే ఉంటుందని స్పష్టం చేశారు.

ఫలితాలు వచ్చేవరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు ఉద్బోధ చేశారు. కేంద్రం తీరు మరీ దారుణంగా తయారైందని, ఎన్నికల్లో పోటీచేయని వారిపైనా దాడులు చేయిస్తూ భీతావహ పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో తెలంగాణలో ఒక్కరిపైనా ఐటీ దాడులు జరగకపోవడం అనుమానాలకు తావిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కేంద్రంలో బీజేపీకి 160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని అన్ని రకాల అంచనాలు చెబుతున్నాయని, మోదీ ఓటమి ఖాయమని అన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ లో 350 మందిని చంపామని చెప్పుకుంటున్నారని, కానీ అంతర్జాతీయంగా ఒక్క దేశం కూడా ఈ విషయాన్ని నిర్ధారించడంలేదని తెలిపారు. మోదీ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ భ్రష్ఠు పట్టించారని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు. కర్ణాటకలో తన ప్రచారం ప్లస్ అవుతోందని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి నాయకులు అంటున్నారని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News