warangal: అయ్యో ‘తండ్రీ’...అందరూ ఉన్నా అనాథలా!

  • పదవీ విరమణ చేసిన ఓ జూనియర్‌ ఇంజనీర్‌ దీనగాథ
  • మూడు వారాలుగా నీరు తాగి ప్రాణాలు నిబెట్టుకున్న వైనం
  • ఇద్దరు కొడుకులు...అయినా ఆదుకునే వారు లేరు

అవసాన దశ ఎంతటి శాపమో...వార్థక్యంలో పిల్లలు నిర్లక్ష్యం చేస్తే ఆ తల్లిదండ్రుల దీనావస్థ ఎలా ఉంటుందనేందుకు ఇదో చక్కని ఉదాహరణ. వరంగల్‌ నగరంలోని చార్‌బౌలికి చెందిన అల్లంపెల్లి వెంకటరామనర్సయ్య (71) సింగరేణి కాలరీస్‌లో జూనియర్‌ ఇంజనీర్‌గా పనిచేసి పన్నెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. నెలకు రూ.30 వేలకు పైగా పింఛన్‌ అందుతుంది. ఆయన ఇద్దరు కొడుకులు ఉన్నత స్థితిలో ఉన్నారు. ఒకరు ఆస్ట్రేలియాలో, మరొకరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

అయితే, అందరూ ఉన్నా ఆయన జీవితానికే ఓ ‘ఆసరా’ లభించ లేదు. భార్య చనిపోవడంతో చార్‌బౌలిలో ఒంటరిగా ఉంటున్నారు. తన పనులు తాను చేసుకుంటూ జీవిస్తుండేవారు. ఇటీవల కాలంలో అనారోగ్యంతో కదలలేని స్థితి ఏర్పడడంతో మూడు వారాలుగా ఇంటికే పరిమితమయ్యారు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఇంటికి వచ్చి చూడగా వెంకటరామనర్సయ్య అపస్మారక స్థితిలో పడివున్నారు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా కోలుకున్నాక వివరాలు రాబట్టారు. శరీరం సహకరించక పోవడంతో ఇంటికే పరిమితమయ్యానని, ఆహారం లేకపోవడంతో మంచినీరు తాగుతూ జీవించానని చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది. పోలీసులు వెంటనే హైదరాబాద్‌లో ఉన్న కొడుకుకి పరిస్థితి వివరించి వరంగల్‌ రప్పించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆయనను బాగా చూసుకోవాలని చెప్పి అప్పగించారు.

More Telugu News