Telangana: ఇంటర్ పరీక్షల్లో నిన్న సున్నా మార్కులు వచ్చిన అమ్మాయికి నేడు 99 మార్కులు!

  • తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు
  • సర్వత్రా విమర్శలు
  • విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ మండిపాటు

తెలంగాణలో ఎన్నడూలేని విధంగా ఇంటర్ మార్కుల వ్యవహారం ఓ ప్రహసనంలా మారింది. ఈ నెల 18న ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి కాగా, కొందరికి దిగ్భ్రాంతి కలిగించేలా మార్కులు వచ్చాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన జి.నవ్య  జన్నారంలోని కరిమల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఇంటర్ ఫస్టియర్‌లో 98 మార్కులు సాధించిన నవ్య.. తాజాగా ఇంటర్ బోర్డు విడుదల చేసిన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో సున్నా మార్కులు రావడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థిని నవ్య షాక్‌‌కు గురైంది.

ఫస్టియర్‌లో నవ్య జిల్లా టాపర్‌గా నిలిచినప్పటికీ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ కావడంతో బోరున విలపించింది. ఇంటర్ బోర్డు తప్పిదం కారణంగా పెద్ద సంఖ్యలో ఇలాంటి అవకతవకలు జరిగినట్టు తెలియడంతో నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు. మరోవైపు, నవ్యకు తెలుగులో సున్నా మార్కులు రావడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ బోర్డు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ఇంటర్ బోర్డు ఆమె పేపర్‌ను సరిదిద్దింది. జరిగిన పొరపాటును సరిదిద్ది బోర్డు ఏకంగా 99 మార్కులు ఇవ్వడం గమనార్హం. అనంతరం దానిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో నవ్య కథ సుఖాంతమైంది.

More Telugu News