Andhra Pradesh: ఏపీలో ఐఏఎస్ అధికారులు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపణ

  • ఇలా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు
  • వర్షకాలానికి ముందే ప్రాజెక్టులు పూర్తి చేయకూడదా?
  • మోదీ న్యాయవ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు
  • రాజమండ్రిలో మీడియాతో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహిస్తే ఈసీకి వచ్చిన ఇబ్బంది ఏంటని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. వర్షాకాలం ముందు పూర్తి కావలసిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోతే ఎలా? అని అడిగారు. ఐఏఎస్ అధికారులు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనీ, అది ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. ఏపీలో 43 రోజుల పాటు పాలనను స్తంభింపజేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఈరోజు ఆయన మీడియాతో ముచ్చటించారు.

ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని గోరంట్ల జోస్యం చెప్పారు. ప్రజలంతా చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఆపద్ధర్మ సీఎం అనే పదం రాజ్యాంగంలోనే లేదనీ, అలాంటప్పుడు సమీక్షలు నిర్వహించడానికి ఉన్న అభ్యంతరం ఏంటని టీడీపీ నేత ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందనీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఈసీ నడుస్తోందని దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థను కూడా భ్రష్టుపట్టించేలా మోదీ వ్యవహరిస్తున్నారని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News