Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం.. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు!: ఐకాస చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

  • ఎంత ఒత్తిడి ఎదురైనా తట్టుకున్నాం
  • కనీస సౌకర్యాలు లేకపోయినా తెల్లవారేదాకా విధుల్లో పాల్గొన్నాం
  • అమరావతిలో మీడియాతో ఐకాస నేత

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా జరిపిన ఘనత రెవిన్యూ ఉద్యోగులదేనని ఏపీ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంతగా ఒత్తిడి ఎదురైనా తట్టుకుని ఎన్నికలు నిర్వహించామని గుర్తుచేశారు. కనీస సౌకర్యాలు లేకపోయినా సర్దుకుని తెల్లవారేదాకా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు.

ఈసీ ఇటీవల ఎన్నికల విధుల్లో పాల్గొన్న ముగ్గురు ఎమ్మార్వోలను సస్పెండ్ చేసిందనీ, ఈ వ్యవహారంపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిశామని తెలిపారు. కేవలం వీవీప్యాట్ స్లిప్పులు బయటపడ్డాయన్న కారణంతో కేసు పెట్టడాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

రాజకీయ నేతలు తమ ప్రయోజనాల కోసం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల విధుల్లో కేవలం ఎమ్మార్వోలే కాకుండా ఇతర ఉద్యోగులు కూడా పాల్గొనేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధులకు హాజరైన వారికి బడ్జెట్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

More Telugu News