Sri Lanka: వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన కొలంబో

  • మూడు చర్చ్ లు, రెండు హోటళ్లలో పేలుళ్లు
  • 42 మంది మృతి, 300 మందికి గాయాలు
  • ఈస్టర్ పండుగ సందర్భంగా శ్రీలంక రాజధానిలో బీభత్సం

ఎంతో పవిత్రమైన ఈస్టర్ పండుగ సందర్భంగా శ్రీలంక రాజధాని కొలంబో రక్తసిక్తమైంది. కొలంబో నగరం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. మూడు చర్చ్ లు, రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో సుమారు 42 మంది వరకు మృతి చెందగా, 300 మందివరకు క్షతగాత్రులయ్యారని స్థానిక వర్గాల కథనం. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

తొలుత బట్టికలోవా ప్రాంతంలోని ఓ చర్చ్ లో పేలుడు సంభవించింది. ఆపై, హోటల్ షాంగ్రీ లా, హోటల్ సినామోన్ గ్రాండ్ లో కూడా పేలుళ్లు చోటుచేసుకునాన్నాయి. ఆపై సెయింట్ ఆంథోనీ ప్రార్థనామందిరం, సెయింట్ సెబాస్టియన్ చర్చ్ ల్లోనూ విస్ఫోటనం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనల్లో ఉండగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

పేలుళ్లు జరిగిన ప్రాంతాలు క్షతగాత్రులతో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా, ఓ వ్యక్తి కదలిక లేకుండా పడివుండగా, పక్కనే ఓ చిన్నారి అత్యంత దీనంగా ఏడుస్తుండడం అందరినీ కలచివేస్తోంది.

More Telugu News