tihar: తీహార్ జైలులో ముస్లిం ఖైదీకి అవమానం.. వీపుపై ‘ఓం’ గుర్తును ముద్రించిన జైలు సిబ్బంది!

  • తీవ్రంగా స్పందించిన ఒవైసీ
  • ముస్లింలను అవమానించడానికి రోజుకొక మార్గాన్ని కనిబెడుతున్నారని వ్యాఖ్య
  • కావాలనే ఈ గుర్తును ముద్రించారని ఆగ్రహం

దేశరాజధాని తీహార్ జైలులో దారుణం చోటుచేసుకుంది. నబ్బీర్ అనే ముస్లిం ఖైదీ వీపుపై కొందరు జైలులోని సిబ్బంది ‘ఓం’ అనే బీజాక్షారన్ని ముద్రించారు. ఇదంతా జైలు సూపరింటెండెంట్ రాజేశ్ చౌహాన్ సమక్షంలోనే జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ముస్లింలను అవమానించడానికి రోజుకొక కొత్త మార్గాన్ని కనిబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒవైసీ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘మమ్మల్ని అవమానించడానికి రోజుకొక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. ఇది చాలా అసాధరణమేకాక ఎంతో అవమానకరం కూడా. మేమూ మనుషులమే, వస్తువులం కాదు. కావాలనే నబ్బీర్‌ ఒంటి మీద ఈ ప్రత్యేక గుర్తును ముద్రించారు. అంతేతప్ప ఇందుకు మరే బలమైన కారణాలు లేవు’ అని ట్వీట్‌ చేశారు.

మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో నబ్బీర్ ను మరో జైలుకు తరలించిన డీజీపీ, ఈ వ్యవహారంపై డీఐజీ స్థాయి అధికారి విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఆయన త్వరలోనే ఢిల్లీ హైకోర్టుకు సమర్పిస్తారని పేర్కొన్నారు.

More Telugu News