Supreme Court: సీజేఐ రంజన్ గొగోయ్ లైంగికంగా వేధించారు.. మా కుటుంబాన్ని అరెస్ట్ చేయించారు!: మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణ

  • నడుము చుట్టు చేయి వేసి కౌగిలించుకున్నారు
  • తిరస్కరించినందుకు వేధింపులకు గురిచేస్తున్నారు
  • 22 మంది సుప్రీం జడ్జీలకు బాధితురాలి లేఖ
  • అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. రంజన్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళ(35) ఆరోపించారు. తన నివాస కార్యాలయంలో రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22 మంది జడ్జీలకు సదరు మహిళ లేఖ రాశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వేధింపులు 2018, అక్టోబర్ 10-11 తేదీల్లో చోటుచేసుకున్నాయని బాధితురాలు తెలిపింది. ‘‘రంజన్ గొగోయ్ వెనుక నుంచి నా నడుము చుట్టూ చేయివేసి నన్ను గట్టిగా పట్టుకున్నారు. చేతులతో నా శరీరమంతా తడిమారు. అనంతరం గట్టిగా హత్తుకున్నారు. ‘నువ్వు కూడా నన్ను కౌగిలించుకో’ అని కోరారు. దీంతో ఆయన నుంచి తప్పించుకోవడానికి నేను పెనుగులాడాను. ఆయన నుంచి తప్పించుకుని బయటపడ్డాను. ఇది జరిగిన 2 నెలలకే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అనుమతి లేకుండా ఒకరోజు సెలవు తీసుకున్నందుకు నన్ను సర్వీసు నుంచి తొలగించారు.

ఈ వేధింపులు అక్కడి నుంచి ఆగిపోలేదు. నా భర్త, నా బావ ఢిల్లీ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని 2012 లో జరిగిన ఓ కాలనీ వివాదంలో గతేడాది డిసెంబర్ 28న సస్పెండ్ చేశారు. నేను నా భర్తతో కలిసి రాజస్తాన్ లో ఉండగా ఓ చీటింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నేను సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి 50 వేలు తీసుకున్నట్లు తప్పుడు ఫిర్యాదు చేయించారు. మా ఇద్దరిని మాత్రమే కాకుండా మా బావ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని అవమానించారు.

24 గంటల పాటు కనీసం నీళ్లు ఇవ్వకుండా చేతులకు బేడీలు వేసి, దూషించడంతో పాటు భౌతికంగానూ దాడిచేశారు. నేను క్షమాపణ చెప్పాలని రంజన్ గొగోయ్ భార్య డిమాండ్ చేసింది. అయితే తాను ఎందుకు క్షమాపణ కోరుతుందో ఆమెకు కూడా తెలియదు. ఆమె చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాను. అయినా నాకు వేధింపులు ఆగలేదు. దివ్యాంగుడైన మా బావ సుప్రీంకోర్టులో తాత్కాలిక జూనియర్ అటెండెంట్ గా గతేడాది అక్టోబర్ 9న నియమితులయ్యారు. ఆయన్ను అకారణంగా సీజేఐ గొగోయ్ తప్పించారు’’ అని ఆరోపించారు.

More Telugu News