Nannapaneni: తానూ ఒకింటి కోడలినేన్న విషయాన్ని ఆ అత్త మరచింది... దుర్మార్గం: విశాఖలో నన్నపనేని రాజకుమారి

  • భర్త, అత్త చేతిలో తీవ్ర వేధింపులు
  • విశాఖలో చికిత్స పొందుతున్న రాజేశ్వరి
  • కఠిన శిక్ష పడాలన్న నన్నపనేని

కట్టుకున్న భర్త, తల్లిలా చూసుకోవాల్సిన అత్త చేతిలో తీవ్ర వేధింపులకు గురై ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్‌ లో చికిత్స పొందుతున్న రాజేశ్వరిని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ, తాను కూడా ఒక ఇంటికి కోడలుగా వచ్చానన్న విషయాన్ని మరచిపోయిన ఇటువంటి అత్తలకు కఠినంగా శిక్ష పడాల్సివుందని అన్నారు.

నిండు గర్భిణిగా ఉన్న రాజేశ్వరిని హింసించిన భర్త దామోదర్, అత్త లలితలకు శిక్ష పడేలా చూస్తానని అన్నారు. తాను మూడు కేసుల్లో బాధితులను పరామర్శించాలని ఇక్కడికి వచ్చానని, కానీ తనకు ఐదుగురు బాధితురాళ్లు కనిపించారని ఆవేదన వ్యక్తం చేసిన రాజకుమారి, ఇటీవలి కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, నిందితుల్లో మహిళలే ఉండటం బాధను కలిగిస్తోందని అన్నారు.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మానవ మృగాలకు సమాజంలో తిరిగే హక్కులేదని, నిందితులకు వేగంగా శిక్షను విధించేందుకు కోర్టులను అభ్యర్థిస్తానని అన్నారు. ఈ తరహా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పోలీసులు, న్యాయవాదులు ఎటువంటి సహకారం అందించరాదని అన్నారు. రాజేశ్వరి కోలుకున్న తరువాత ఉపాధి కల్పిస్తామని, బిడ్డను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

More Telugu News