KA Paul: ముగ్గురు కమిషనర్లకు ఒకేసారి స్వైన్‌ఫ్లూ వచ్చిందా? నేరగాళ్లకు సమయం ఇచ్చి నాకు ఇవ్వరా?: చిందులేసిన కేఏపాల్

  • పాల్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వని ఈసీ
  • ఫోన్ నంబరు ఇచ్చి వెళ్లాలని సూచన
  • ఈసీపై పాల్ ఆగ్రహజ్వాల

ఎలక్షన్ కమిషన్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిందులేశారు. తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థులకు అపాయింట్‌మెంట్ ఇచ్చి తనకు ఎందుకు ఇవ్వరంటూ మండిపడ్డారు. ఈవీఎంలపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం పాల్ ఈసీ కార్యాలయానికి వచ్చారు. అయితే, ఆయనను కలిసేందుకు నిరాకరించిన ఎన్నికల కమిషనర్లు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సాయంత్రం రావాలంటూ అక్కడి సిబ్బంది సూచించారు.

దీంతో సాయంత్రం ఐదు గంటలకు వచ్చిన పాల్‌కు మరోమారు చుక్కెదురైంది. కమిషనర్లు అందుబాటులో లేరని, వారు వచ్చాక తెలియజేస్తామని, ఫోన్ నంబరు ఇచ్చి వెళ్లాలని సూచించారు. అదే సమయంలో వైసీపీ నేతలకు అపాయింట్‌మెంట్ లభించడంతో పాల్ ఆగ్రహంతో ఊగిపోయారు.

నేరగాళ్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చి తనకెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కమిషనర్లకు స్వైన్‌ఫ్లూ వచ్చిందని సిబ్బంది చెబుతున్నారని, ఒకేసారి ముగ్గురికీ ఎలా వస్తుందని నిలదీశారు. ఈసీ వైఖరి ఎంతమాత్రమూ సమర్థించేదిగా లేదని, పార్టీలన్నీ మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరించాలని పాల్ పిలుపునిచ్చారు.  

More Telugu News