Lavanya: టీసీఎస్ ఉద్యోగిని లావణ్య హత్యకేసులో ప్రియుడే కాలయముడు!

  • సూట్ కేసులో కుక్కిన స్థితిలో లావణ్య మృతదేహం
  • మస్కట్ తీసుకెళ్తానంటూ, శంషాబాద్ లో హత్య
  • సునీల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ శివార్లలోని సూరారం కాలువలో సూట్ కేసులో కుక్కిన స్థితిలో లభ్యమైన లావణ్య మృతదేహంకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. బీటెక్ చదివి, టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న లావణ్యను, ఆమె క్లాస్ మేట్, మోల్టెన్ సంస్థలో పనిచేస్తున్న సునీల్ అత్యంత దారుణంగా హతమార్చాడని పోలీసులు తేల్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, లావణ్యను ప్రేమిస్తున్నానని, ఆమెనే వివాహం చేసుకుంటానని, తరచూ లావణ్య ఇంటికి వచ్చి వెళుతుండే సునీల్, మస్కట్ లో మంచి ఉద్యోగం ఉందని, ఇంటర్వ్యూకు తానే తీసుకు వెళతానని చెప్పగా వారు అంగీకరించారు.

ఈ నెల 4న లావణ్యను తీసుకుని శంషాబాద్ కు చేరుకున్న సునీల్, వాష్ రూమ్ కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి, విమానం వెళ్లిపోయాక వచ్చి, తదుపరి విమానంలో వెళదామని చెప్పి, శంషాబాద్ లోని ఓ లాడ్జిలో బస చేశారు. 5వ తేదీన ఉదయం పెళ్లి విషయంలో వాదన జరగడంతో, తీవ్ర ఆగ్రహంతో లావణ్య గొంతు నులిమాడు. దీంతో ఆమె మరణించగా, సూట్ కేసులోని దుస్తులు తీసేసి, మృతదేహాన్ని అందులో కుక్కాడు. అదే రోజు రాత్రి సూట్ కేసును సూరారం కాలువలో పడేశాడు.

తమ బిడ్డ మస్కట్ వెళ్లి ఆరు రోజులైనా తిరిగి రాకపోవడంతో లావణ్య తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు తొలి అనుమానం సునీల్ పైనే వచ్చింది. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా, మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.

More Telugu News