Nara Lokesh: అపరమేధావుల్లారా.. ఈవీఎంల దొంగలంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు?: లోకేశ్

  • ప్రమాదంలో ప్రజాస్వామ్యం అని బీజేపీ పుస్తకం రాయొచ్చు
  • మోదీ-కేసీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారో?
  • ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చని కేసీఆర్ మీడియాకు చెప్పొచ్చు
  • మేం మాత్రం ప్రశ్నించకూడదా?

ఈవీఎంల పనితీరుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పోరాటం మొదలుపెట్టారు. ఈవీఎంలలో లోపాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధమయ్యారు. చంద్రబాబు తీరుపై బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్‌లు మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమర్శలపై నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వరుస ట్వీట్లతో ఆయా పార్టీలపై దుమ్మెత్తి పోశారు.

‘అప‌ర‌మేధావులూ.. ఈవీఎం దొంగ‌లంటే భుజాలు త‌డుముకుంటారెందుకు? ఏపీలో ఎన్నిక‌లు అస్త‌వ్య‌స్త నిర్వ‌హ‌ణ‌పై టీడీపీ పోరాటం మీకు చెల‌గాటంగా మారింది. ఈవీఎంలపై అనుమానాలంటే జ‌గ‌న్‌, మోదీ, కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?’ అని ప్రశ్నించారు. ‘ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం అంటూ బీజేపీ ఎంపీ పుస్తకం రాయొచ్చు. ఈవీఎంలు ట్యాంప‌రింగ్ చేయొచ్చ‌ని కేసీఆర్ మీడియాకి చెప్పొచ్చు. కానీ, 50శాతం వీవీప్యాట్‌లు లెక్కించాల‌ని టీడీపీ కోర‌కూడ‌దా?’ అని సూటిగా ప్రశ్నించారు.

‘ఐటీ-టెక్నాలజీకి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని  ఈవీఎం వ్య‌వ‌స్థలోని లోపాలను స‌మ‌ర్థించాలా?’ అని నిలదీశారు. తెలంగాణలో పనిచేసి ఏపీలో మొరాయించిన ఈవీఎంల వెనక ఉన్న కుట్రని ప్రశ్నించకూడదా? టీడీపీ కంచుకోట‌ల్లాంటి ప్రాంతాల్లోనే ఈవీఎంలు ఎందుకు ప‌నిచేయ‌లేద‌ని అడ‌గ‌కూడ‌దా?’అంటూ ప్రశ్నించారు.

ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చంటూ 2010లోనే టీడీపీ వెలుగులోకి తెచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈవీఎంలో అవకతవకలకు పాల్పడొచ్చని హరిప్రసాద్ అప్పుడే నిరూపించారని అన్నారు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, అయితే, ఆయన వాదనలో నిజాల్ని గుర్తించి టీడీపీ అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందన్న లోకేశ్.. ఈవీఎంల పనితీరుపై విపక్షాలను ఒక్కటి చేసే ప్రయత్నాలు ప్రారంభించారన్నారు.

వ్యవస్థల్ని మోదీ ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు. గతంలో ఈవీఎంల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేసీఆర్ కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. మోదీ నుంచి అందిన సాయానికి జగన్ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు చెప్పారని లోకేశ్ దుమ్మెత్తిపోశారు.

More Telugu News