secunderabad: పోలింగ్ ముగిసినా ఓటింగ్ జరిగిందా?: కిషన్ రెడ్డి అనుమానం

  • సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్  
  • నిన్న నమోదైన ఓటింగ్ శాతం 39 అన్నారు
  • ఇప్పుడు 45 శాతం అని ఎలా చెబుతున్నారు?

సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిన్న పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓటింగ్ శాతానికి, ఆ తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి తేడా ఉందని అక్కడి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ ను కలిశారు.

నిన్న పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓటింగ్ శాతం 39 అని చెప్పి, ఇప్పుడు 45 శాతం అని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా ఓటింగ్ జరిగిందా? అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి పోలింగ్ బూత్ లలో ఎవరూ లేకపోయినా పోలింగ్ శాతం ఎలా పెరిగిందని, ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని కిషన్ రెడ్డి కోరారు.

ఇదే విషయమై చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో నిన్న సాయంత్రం ఐదు గంటలకు 53 శాతం పోలింగ్ నమోదైందని చెప్పి, మళ్లీ 61 శాతం అని ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని, రేపు రంగారెడ్డి రిటర్నింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

More Telugu News