Andhra Pradesh: ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన నేత.. పూర్తి సమాచారం అందాక స్పందిస్తానన్న పవన్ కల్యాణ్!

  • జనసేన నేత మధుసూదన్ గుప్తా నిర్వాకం
  • పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
  • పనిచేయకుండా పోయిన ఈవీఎం

అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటుచేసిన ఈవీఎంను ఈరోజు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా నేలకేసి కొట్టిన సంగతి తెలిసిందే. పోలింగ్ కంపార్ట్ మెంట్ లో నియోజకవర్గం పేరును సరిగ్గా రాయలేదని ఆగ్రహం వ్యక్తంచేసిన గుప్తా, పోలింగ్ కేంద్రంలో ఇతర పార్టీల ఏజెంట్లతో గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఈవీఎంను నేలకేసి కొట్టడంతో అది పనిచేయకుండా పోయింది. దీంతో పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా విజయవాడలో పవన్ కల్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో మీడియా ఈ వ్యవహారంపై ఆయన్ను ప్రశ్నించింది.

దీంతో పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. గుత్తిలోని బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 183వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు తాను మీడియాలో చూశానని తెలిపారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. విషయం పూర్తిగా తెలుసుకోకుండా కామెంట్లు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పార్టీ వర్గాల నుంచి పూర్తి సమాచారం అందుకున్న తర్వాతే మీడియాతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. అనంతరం పవన్ హైదరాబాద్ కు బయలుదేరారు.

More Telugu News