Andhra Pradesh: పులి కడుపున పులే పుడుతుంది.. పప్పు పుట్టదు!: వైసీపీ నేత పృథ్వీ సెటైర్లు

  • సీఎం పదవికి చంద్రబాబు అనర్హుడు
  • వైసీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టారు
  • చిన్న సినిమాను చూసి భయపడుతున్నారు

ముఖ్యమంత్రి పదవికి టీడీపీ అధినేత చంద్రబాబు అనర్హుడని వైసీపీ నేత ప్రముఖ నటుడు పృథ్వీ విమర్శించారు. చంద్రబాబు జీవితమంతా కాపీలమయమేననీ, ఈ విషయం టీడీపీ మేనిఫెస్టోను గమనిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్యాకేజీ స్టార్ గా మారిపోయారని ఎద్దేవా చేశారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి చేయడం అమానుషమని వ్యాఖ్యానించారు. భీమవరంలో రఘురామ కృష్ణంరాజుతో కలిసి ఈరోజు పృథ్వీ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబును, టీడీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు ఫిక్స్ అయిపోయారని వ్యాఖ్యానించారు. నాగబాబు, పవన్ మాట్లాడుతున్న భాష సరిగాలేదని తెలిపారు. నటనవేరు, రాజకీయం వేరని అన్నారు. ఏపీ ప్రజలంతా రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పులి కడుపున పులే పుడుతుందని, పప్పు పుట్టదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో వైసీపీ ఫ్యాన్ 140 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోందనీ, ఈ మూడు రోజులు పరీక్షా సమయమని వ్యాఖ్యానించారు.

అన్ని కులాలకు చెందిన ప్రజలు జగన్ వెంటే ఉన్నారని పృథ్వీ అన్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఓ చిన్నసినిమాను చూసి భయపడుతున్నారనీ, దీన్నిబట్టే ఆయన ధైర్యం ఏమిటో అర్థం అవుతుందన్నారు. ముస్లింల ఓట్ల కోసమే ఫరూక్ అబ్దుల్లాను ఏపీకి తీసుకొచ్చారని దుయ్యబట్టారు.  ఫ్యాన్ అసెంబ్లీలో ఉంటే, సైకిల్ స్టాండులో, గ్లాసు క్యాంటీన్‌లో ఉంటుందని జోస్యం చెప్పారు.

More Telugu News