masood ajar: మసూద్‌ అజార్‌ విషయంలో అమెరికా దూకుడు : ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా

  • అతన్ని బ్లాక్‌ లిస్టులో చేర్చుతామంటున్న అగ్రరాజ్యం
  • భద్రతామండలి ఆంక్షల అతిక్రమణ అంటున్న డ్రాగన్‌
  • మసూద్‌ విషయంలో కొన్నేళ్లుగా మోకాలడ్డుతున్న చైనా

పాకిస్థాన్‌లో తిష్టవేసి భారత్‌పై ఉగ్ర యుద్ధం చేస్తున్న జైషేమహ్మద్‌ చీఫ్ మసూద్‌ అజర్‌ విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తుండగా, చైనా ఆగ్రహంతో రగలిపోతోంది. ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో చేర్చాలన్న బారత్‌ ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో 14 దేశాలు మద్దతు ఇస్తుండగా, వీటో అధికారం ఉన్న చైనా మాత్రం మోకాలడ్డుతున్న విషయం తెలిసిందే.

ఓ వైపు ఉగ్రవాదం ప్రపంచానికే ప్రమాదకరం అంటూనే మసూద్‌ విషయంలో అనుకూల వైఖరి అనుసరిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న చైనా కుయుక్తులు పసిగట్టిన అమెరికా ప్రత్యామ్నాయ మార్గంలో అతన్ని బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు యత్నిస్తోంది. ‘మసూద్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటాం’ అంటూ ప్రకటించింది.

ఇందుకోసం బ్రిటన్‌, ప్రాన్స్‌తో కలిసి సరికొత్త తీర్మానాన్ని రూపొందించామని, ఇటీవలే దాన్ని ఐరాసా భద్రతామండలిలోని సభ్యదేశాలకు పంపించినట్లు తెలిపింది. మసూద్‌కు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో సంబంధాలున్నాయని, ఆయా సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందించడం, మద్దతు తెలపడం చేస్తున్నాడని తెలిపింది. అందువల్ల అతనిపై ఆంక్షలు విధించాలని, ప్రయాణాలను నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని ఆ తీర్మానంలో కోరింది.

ఈ కొత్త తీర్మానానికి భద్రతా మండలిలోని తొమ్మిది దేశాలు అంగీకరిస్తే చాలు, అమల్లోకి వస్తుంది. దీంతో అమెరికాపై డ్రాగన్‌ మండిపడిపోతోంది. మసూద్‌ విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీని అతిక్రమించి అమెరికా చర్యలు చేపడుతోందని ఆరోపిస్తోంది. అమెరికా చర్యల వల్ల మసూద్‌ సమస్య పరిష్కారం కాదు కదా, మరింత క్లిష్టమవుతుందని హెచ్చరించింది. అయితే చైనా ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది.

More Telugu News