Visakhapatnam District: డీజీపీ ఠాకూర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.. వారికి రివార్డులివ్వాలన్న పోలీస్ బాస్!

  • సమస్యాత్మక ప్రాంతాల్లో పరిశీలన కోసం ఏజెన్సీ గ్రామాలకు పయనమైన డీజీపీ
  • డీజీపీ అని తెలియక ఆయన వాహనాన్ని కూడా తనిఖీ చేసిన పోలీసులు
  • సారీ చెప్పిన ఎస్పీ, డీఐజీ

విజయనగరం జిల్లాలోని ఎస్.కోట పోలీసులు ఏకంగా డీజీపీ వాహనాన్నే తనిఖీ చేసి సంచలనం సృష్టించారు. తాము తనిఖీ చేసింది తమ బాస్ వాహనాన్నే అని తెలిసి తర్వాత నాలుక్కరుచుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు డీజీపీ ఠాకూర్ మంగళవారం అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లారు. అవన్నీ సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో కాన్వాయ్‌ను పక్కనపెట్టి ప్రైవేటు వాహనంలో బయలుదేరారు. ఆయన వెనక మరో వాహనంలో భద్రతా సిబ్బంది వెళ్లారు.

ఈ క్రమంలో ఎస్.కోటలోని ఫుట్ హిల్  వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు డీజీపీ వాహనాన్ని కూడా ఆపారు. డీజీపీ కారు అద్దం దించిన తర్వాత సీఐ బి.వెంకటేశ్వరరావు, సర్వెలెన్స్‌ టీం అధికారి ఇందిర ఆయన వద్దకు వెళ్లి కారు తనిఖీ చేయాలని అన్నారు. దీంతో కారు దిగిన ఆయన చెక్ చేసుకోవాలని సూచించారు. వెంటనే వెనక వాహనంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆయన డీజీపీ అని చెప్పబోతుండగా ఠాకూర్ వారించారు. ఆ వాహనాన్ని కూడా చెక్ చేసుకోవాలని సూచించారు.

ఆ వాహనంలో ఆయుధాలు కనిపించడం, తాము తనిఖీ చేసింది తమ బాస్ కారునేనని తెలియడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలిసిన జిల్లా ఎస్పీ దామోదర్, విశాఖ డీఐజీ పాలరాజు డీజీపీకి ఫోన్ చేసి సారీ చెప్పారు. అయితే, పోలీసు బాస్ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. విధినిర్వహణలో రాజీ పడకుండా అందరి వాహనాలను ఒకేలా తనిఖీ చేస్తున్నారంటూ ప్రశంసించారు. వారికి రివార్డు ఇవ్వాలని ఆదేశించారు.

More Telugu News