mohanbabu: కోర్టును తప్పుదోవ పట్టించారు..సెషన్స్ కోర్టులో తేల్చుకుంటాం: మోహన్ బాబు

  • 'సలీమ్' చిత్రానికి సంబంధించిన మొత్తాన్ని వైవీఎస్ చౌదరికి ఇచ్చేశాం
  • మరో సినిమా కోసం రూ. 40 లక్షల చెక్కు ఇచ్చాం
  • ఆ తర్వాత మరో సినిమా ఆయనతో వద్దనుకున్నాం

చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ 23వ మెట్రోపాలిటన్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లిస్తానంటూ మోహన్ బాబు చెప్పడంతో... ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై మోహన్ బాబు స్పందించారు.

2009లో 'సలీమ్' సినిమాను చేస్తున్న సమయంలో దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఆ చిత్రానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించామని మోహన్ బాబు తెలిపారు. తమ బ్యానర్ లోనే మరో సినిమా చేయడానికిగానూ రూ. 40 లక్షల చెక్కును ఆయనకు ఇచ్చామని చెప్పారు. అయితే, 'సలీమ్' అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో... వైవీఎస్ చౌదరితో మరో సినిమా వద్దనుకున్నామని... అదే విషయాన్ని ఆయనతో చెప్పామని తెలిపారు. చెక్ ను బ్యాంకులో వేయవద్దని చెప్పామని అన్నారు. అయినా కావాలనే చెక్కును ఆయన బ్యాంకులో వేసి, బౌన్స్ చేశారని మండిపడ్డారు. తనపై చెక్ బౌన్స్ కేసు వేసి, కోర్టును తప్పుదోవ పట్టించారని... దీంతో, కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వచ్చిందని తెలిపారు.

కోర్టు తీర్పును తాము సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నామని మోహన్ బాబు చెప్పారు. తనపై కొన్ని ఛానల్స్ లో వస్తున్న ఆరోపణలను నమ్మవద్దని విన్నవించారు.

More Telugu News