Telangana: తెలంగాణ ప్రభుత్వం రిమోట్ మోదీ చేతుల్లో ఉంది: రాహుల్ గాంధీ

  • రాఫెల్ కుంభకోణంపై కేసీఆర్ మాట్లాడారా?
  • జీఎస్టీ  విషయంలో మోదీని కేసీఆర్ సమర్థించలేదా?
  • అబద్ధాలు చెప్పడంలో మోదీని మించిన వారు లేరు

తెలంగాణ ప్రభుత్వం రిమోట్ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఉందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ సర్కార్ రిమోట్ మోదీ చేతిలో ఉందని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాఫెల్ కుంభకోణంపై కేసీఆర్ మాట్లాడారా? గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) విషయంలో మోదీని కేసీఆర్ సమర్థించలేదా? అని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్-బీజేపీ మధ్య యుద్ధంగా రాహుల్ అభివర్ణించారు.

మోదీ దేశానికి కాదు అనిల్ అంబానీ, నీరవ్ మోదీలాంటి వారికే చౌకీదార్ అని, దొంగలకు ఆయన మద్దతు ఇస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోదీ మోసం చేశారని, అబద్ధాలు చెప్పడంలో ఆయన్ని మించిన వారు లేరని విమర్శించారు. దేశానికి న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదోడి అకౌంట్ లో ఏడాదికి రూ.72 వేలు వేస్తామని హామీ ఇచ్చారు. పేదలపై మోదీ సర్జికల్ స్ట్రయిక్స్ చేశారని, తాము మాత్రం పేదరికంపై ఆ స్ట్రయిక్స్ చేస్తామని అన్నారు. పేదలు, రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని రాహుల్ మరోసారి వ్యాఖ్యానించారు.

More Telugu News