Jana Sena: గాజువాకలో అద్దెకు ఇళ్లు తీసుకున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌

  • పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో నిర్ణయం
  • వై జంక్షన్‌ సమీపంలోని కర్ణవానిపాలెంలో నివాసం
  • ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలన్నీ ఇక ఇక్కడి నుంచే

విశాఖ మహానగరంలోని గాజువాకపై పూర్తిస్థాయి దృష్టిసారించాలని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. గాజువాక నియోజకవర్గం నుంచి స్వయంగా పోటీ పడుతుండడంతో నియోజకవర్గం వ్యవహారాలతోపాటు పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేందుకు అద్దె ఇంటిని తీసుకున్నారు. ‘ఓ ఇల్లు  లేదు...కార్యాలయం లేదు’ అంటూ విపక్ష టీడీపీ, వైసీపీ విమర్శలదాడి చేస్తుండడంతో గాజువాక వై జంక్షన్‌ సమీపంలోని కర్ణవానిపాలెంలో ఇల్లు అద్దెకు తీసుకుని సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇకపై ఇక్కడే నివాసం ఉంటారని, ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే చక్కబెడతారని పార్టీ వర్గాల సమాచారం.

ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ప్రచారాన్ని కూడా ఉధృతం చేయాలని నిర్ణయించారు. పవన్‌కల్యాణ్‌ ప్రచారానికి వీలుగా విజయవాడ నుంచి ప్రచార రథాలను కూడా రప్పించారు. అలాగే గాజువాక నియోజకవర్గంలో ప్రచారానికి ప్రత్యేక కమిటీలు నియమించారు. వార్డుకు 10 నుంచి 20 ప్రచార కమిటీలు వేయడంతోపాటు ఈ కమిటీలను పర్యవేక్షించేందుకు ప్రతి వార్డు నుంచి కనీసం ఇద్దరు చొప్పున మొత్తం 35 మందితో నియోజకవర్గ ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా పవన్‌ ఇతర నియోజకవర్గాల ప్రచారంలో ఉన్నప్పుడు ఈ కమిటీలే పూర్తిస్థాయి ప్రచార బాధ్యతను చూస్తాయి. ఇప్పటికే పలుమార్లు గాజువాకలో రోడ్‌ షోలు నిర్వహించిన పవన్‌ నిన్న రాత్రి కూడా విశాఖ ఎంపీ అభ్యర్థి వి.వి.క్ష్మీనారాయణతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు.

More Telugu News