Andhra Pradesh: ఫలించిన చంద్రబాబు దౌత్యం.. మెత్తబడ్డ కల్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి!

  • ఉమామహేశ్వరనాయుడికి టికెట్ ఇచ్చిన సీఎం
  • రెబెల్ గా పోటీకి దిగిన హనుమంతరాయ చౌదరి
  • కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని బాబు హామీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దౌత్యం ఫలించింది. టికెట్లు దక్కకపోవడంతో అలకబూని రెబెల్ గా పోటీలోకి దిగిన పలువురు నేతలు ముఖ్యమంత్రి బుజ్జగింపులతో వెనక్కి తగ్గుతున్నారు. కల్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి చంద్రబాబు ఈసారి టికెట్ కేటాయించలేకపోయారు. ఆయనకు బదులుగా ఉమామహేశ్వరనాయుడికి సీటును ఇచ్చారు. దీంతో మనస్తాపానికి లోనైన హనుమంతరాయ చౌదరి రెబెల్ గా నామినేషన్ దాఖలు చేశారు.

హనుమంతరాయచౌదరి పోటీలో ఉంటే టీడీపీకి నియోజకవర్గంలో నష్టం జరుగుతుందని భావించిన టీడీపీ శ్రేణులు విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాయి. వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు.. హనుమంతరాయ చౌదరి, ఆయన కుమారుడు మారుతిని అమరావతికి పిలిపించుకున్నారు. హనుమంతరాయ చౌదరికి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఆయన కుమారుడు మారుతికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.

దీంతో మెత్తబడ్డ చౌదరి తన నామినేషన్ ను ఈరోజు ఉపసంహరించుకునే అవకాశముందని తెలుస్తోంది. ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.

More Telugu News