YSRCP: ఈ డీజీపీ మాకొద్దు, వెంటనే మార్చండి... కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయిన వైసీపీ నేతలు

  • టీడీపీ అధికార దుర్వినియోగం చేస్తోంది
  • హెలికాప్టర్ గుర్తుపైనా ఫిర్యాదు
  • ఢిల్లీ వెళ్లిన వైసీపీ నేతలు

వైసీపీ నేతలు నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా, రాష్ట్ర డీజీపీ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులను వెంటనే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.

అంతేగాకుండా ప్రజాశాంతి పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును రద్దు చేయాలని కోరారు. ఆ గుర్తు వైసీపీ ఫ్యాన్ గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు గందరగోళానికి లోనయ్యే ప్రమాదం ఉందని ఎన్నికల సంఘానికి వివరించారు. చంద్రబాబు అండతోనే ప్రజాశాంతి పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తోందని ఆరోపించారు. ఇదే విషయాన్ని కొన్నిరోజుల క్రితమే పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ కండువా కూడా వైసీపీ కండువాను పోలి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముండడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News