Andhra Pradesh: వైసీపీకి సినీ గ్లామర్.. త్వరలో పార్టీలో చేరబోతున్న నిర్మాత నట్టి కుమార్!

  • 1981 నుంచి టీడీపీలోనే ఉన్నాను
  • కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందం నచ్చలేదు
  • పవన్ విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలకు సినీ గ్లామర్ తోడవుతోంది. ఇటీవల నటులు శివాజీరాజా, కృష్ణుడు, అలీ, పృధ్వీతో పాటు దాసరి అరుణ్ కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ సినీ నిర్మాత వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. త్వరలోనే తాను వైసీపీలో చేరబోతున్నట్లు నిర్మాత నట్టికుమార్ ప్రకటించారు. తాను 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని పేర్కొన్నారు.

కానీ ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చీకటి ఒప్పందం నచ్చకే కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు నట్టికుమార్ చెప్పారు. టీడీపీకి ఓటేయకపోతే మహిళల పసుపు-కుంకుమలు పోతాయని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ చెప్పడాన్ని నట్టికుమార్ తప్పుపట్టారు. రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జగన్ ను ఇబ్బంది పెట్టేందుకే పవన్ కల్యాణ్, కేఏ పాల్ లను చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.

తెలంగాణలో ఆంధ్రప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారనీ, ఏపీ ప్రజలను తెలంగాణలో కొడుతున్నారని పవన్ కు ఎవరు చెప్పారో తనకు తెలియదని నట్టికుమార్ వ్యాఖ్యానించారు. అనవసరంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్నారు. ‘చిరంజీవి కాపులను సొంతం చేసుకుని దెబ్బతిన్నారు, రాజశేఖర్‌ రెడ్డి గారు ఒక్కరే కులాలకు అతీతంగా ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారన్నారు. ఇప్పుడు కట్టుబట్టలతో అమరావతి వచ్చాము అని చంద్రబాబు అంటున్నారు. మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాలైన రాజమండ్రి, వైజాగ్, అమలాపురం, యానాంను ఎందుకు అభివృద్ధి చేయలేదు?’ అని నిలదీశారు.

More Telugu News