Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో టెన్షన్.. ఆరుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్.. ఆందోళనకు దిగిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డి!

  • నిన్న కందుకూరులో వైసీపీ-టీడీపీ శ్రేణుల ఘర్షణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
  • స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కందుకూరులో నిన్న వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో ఆరుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో వైసీపీ నేత, మాజీమంత్రి మహీధర్ రెడ్డి వైసీపీ శ్రేణులతో కలిసి కందుకూరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

  కందుకూరులో నిన్న సర్వే నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను వైసీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల వివరాలను వీరు నమోదు చేస్తున్నారంటూ ఆర్డీవో కార్యాలయానికి తీసుకొచ్చారు.

విషయం తెలుసుకున్న టీడీపీ నేత పోతుల రామారావు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు వైసీపీ కార్యకర్తలపై కేసు పెట్టారు.

More Telugu News