Chandrababu: తిరుపతిలో నేడు చంద్రబాబు భారీ బహిరంగ సభ.. సీఎం నేటి షెడ్యూలు ఇలా..!

  • అభ్యర్థుల గెలుపు కోసం చంద్రబాబు సుడిగాలి పర్యటన
  • నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం
  • ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు బిజీ

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోరు పెంచారు. తీరకలేని షెడ్యూలుతో బిజీగా మారారు. రోజూ బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించి బరిలో ఉన్న పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు.

ఈ ఉదయం 9:30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10:30 గంటలకు కడప చేరుకుంటారు. అనంతరం బద్వేలు, రాయచోటి  ప్రచార సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పలమనేరు చేరుకుని మధ్యాహ్నం 1.45 గంటల నుంచీ 2.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి అమరనాథ రెడ్డి బరిలో ఉన్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాళహస్తి చేరుకుని పట్టణంలోని బేరివారి కల్యాణ మండపం కూడలిలో మధ్యాహ్నం 3:30 నుంచి 4.15 గంటల వరకు జరగనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు.

శ్రీకాళహస్తి సభ ముగిసిన వెంటనే చంద్రగిరి చేరుకుని సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం  రోడ్డుమార్గంలో తిరుపతి చేరుకుంటారు. సాయంత్రం 6:45 నుంచి 7:45 గంటల వరకు నగరంలోని లీలామహల్‌ కూడలి నుంచి సత్యనారాయణ పురం జంక్షన్‌ వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు  సత్యనారాయణపురం జంక్షన్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 9.30 గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరుతారు.

More Telugu News