Andhra Pradesh: 11వ తారీకు ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు: పరిటాల సునీత

  • రాప్తాడులో నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్
  • నా భర్తను, నన్ను ఆదరించినట్టే శ్రీరామ్ ని ఆదరించాలి 
  • శ్రీరామ్ బాబును మంచి మెజార్టీతో గెలిపించాలి
అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ తో ఆయన తల్లి పరిటాల సునీత, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అధికసంఖ్యలో ఉన్నారు. శ్రీరామ్ మెడలో వేసేందుకు ఆయన అభిమానులు ప్రత్యేక పూలదండను తయారు చేయించారు. వెయ్యి కిలోల పూలతో తయారు చేయించిన ఈ పూల దండను భారీ క్రేన్ సాయంతో శ్రీరామ్ మెడలో వేశారు.

శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి చెబుతున్నామని అన్నారు. ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఎంత ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని, అదే విధంగా, రాప్తాడు నియోజకవర్గంలో తిరిగి టీడీపీ గెలిస్తే ఎంత మేలు జరుగుతుందనేది చెబుతున్నట్టు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ, తన భర్త పరిటాల రవిని, తననూ ఏవిధంగా అయితే ప్రజలు ఆదరించారో, అదే విధంగా తన కొడుకు శ్రీరామ్ ను కూడా దీవించాలని కోరారు. ‘మా ముద్దుల కొడుకు శ్రీరామ్ బాబుకు టికెట్ కేటాయించడంతో పెద్దల నుంచి యువత వరకూ సంతోషంగా ఉన్నారు. పల్లెల్లోకి వెళితే ‘ఎప్పుడు 11వ తారీకు వస్తుంది.. ‘మేము ఓటెయ్యాలి అక్క’ అని ఉత్సాహంగా ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి వల్ల అందరూ ఆశీస్సులు ఇస్తున్నారు. ఎన్నికల్లో శ్రీరామ్ బాబును మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.
Andhra Pradesh
Anantapur District
Raptadu
paritala

More Telugu News