Chandrababu: ఎంక్వైరీ వేసి చూడండి.. నా నిజాయతీ తెలుస్తుంది: చంద్రబాబుకు బొత్స సవాల్

  • అన్ని వ్యవస్థలను నాశనం చేశారు
  • ఆరోపణలే తప్ప ఏనాడైనా నిరూపించారా?
  • సీఎంపై మండిపడిన వైసీపీ నేత
కొన్నిరోజుల కిందట చీపురుపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయగా, ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని ప్రతి వ్యాఖ్యలు చేశారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స నేడు నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు.

ప్రతిసారి తాను దోపిడీకి పాల్పడ్డానంటూ ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, విచారణకు ఆదేశించి చూడాలని సవాల్ విసిరారు. తనపై ఆరోపణలు చేయడమే తప్ప ఏనాడూ నిరూపించలేకపోయారని మండిపడ్డారు. చేసిన ఆరోపణలపై ఎంక్వైరీ వేసి చూస్తే తన నిజాయతీ స్పష్టమవుతుందని బొత్స వ్యాఖ్యానించారు. వివేకా హత్యకేసు జరిగి పదిరోజులు గడుస్తున్నా ఇంకా తేల్చలేకపోవడానికి కారణం చంద్రబాబు పోలీసు వ్యవస్థను నాశనం చేయడమే అన్నారు.
Chandrababu
Botsa Satyanarayana

More Telugu News