Telangana: పబ్ జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ యువకుడు!

  • జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఘటన
  • పబ్ జీ ఆడటంతో పట్టేసిన మెడ నరాలు
  • చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన సాగర్

పబ్ జీ.. ఈ స్మార్ట్ ఫోన్ గేమ్ ప్రస్తుతం దేశంలోని యువతను ఊపేస్తోంది. అయితే అదేపనిగా పబ్ జీ ఆడుతూ చాలామంది ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా పబ్ జీ గేమ్ కు బానిసైన ఓ యువకుడు మెడ నరాలు దెబ్బతినడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్(20) తొలుత పబ్ జీ గేమ్ ను టైంపాస్ గా ఆడటం మొదలుపెట్టాడు. అయితే ఇది కాస్తా వ్యసనంగా మారింది. 45 రోజులు అదేపనిగా పబ్ జీ ఆడటంతో మెడ నరాలు పట్టేశాయి. దీంతో కుటుంబ సభ్యులు సాగర్ ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ, మెడ నరాలు పూర్తిగా దెబ్బతినడంతో సాగర్ ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచాడు.

దీంతో సాగర్ స్వగ్రామం రాజారంపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరోవైపు కర్ణాటకలో పబ్ జీ గేమ్ కు బానిసైన ఇంటర్ విద్యార్థి ఎకనామిక్స్ పేపర్లో, పబ్ జీ ఎలా ఆడాలి? ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి? అంటూ సబ్జెక్టుకి సంబంధం లేకుండా వ్యాసం రాయడంతో ఫెయిల్ అయ్యాడు.

More Telugu News