Andhra Pradesh: వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల

  • మంగళగిరి నియోజకవర్గం బీసీలకే కేటాయిస్తున్నారు
  • ఈసారి కూడా అలాగే అనుకున్నాం
  • చంద్రబాబు మోసం చేశారు

గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ నాయకురాలు, ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ ని ఈరోజు ఆమె కలిశారు. జగన్ ఆమెకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఎప్పటి నుంచో మంగళగిరి నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయిస్తున్నారని, ఈసారి కూడా బీసీ అభ్యర్థులకే టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. మాట ఇచ్చి తప్పినందుకు నిరసనగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నానని అన్నారు. చంద్రబాబు బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకోలేరని భావించే, తాను బేషరతుగా వైసీపీలో చేరినట్టు చెప్పారు.

ఏపీని, బీసీలను అభివృద్ధి చేస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కాకుండా, వాళ్ల కుటుంబం అభివృద్ధి కోసం బాబు పరిపాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కాగా, 2009లో మంగళగిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు ఆమె దూరంగా ఉన్నారు. మూడు నెలల క్రితం ఆమె టీడీపీలో చేరారు.

More Telugu News