Chandrababu: 'ప్లీజ్ ఒక్క అవకాశం' అనేవాళ్లను నమ్మితే అంతే సంగతులు!: చంద్రబాబు హెచ్చరిక

  • కేసీఆర్, మోదీ చేతిలో జగన్ కీలుబొమ్మ
  • జగన్ కు ఏమైనా అనుభవం ఉందా?
  • ఒక్క అవకాశం ఇస్తే మరణవాంగ్మూలం రాసుకున్నట్టే!
విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్ లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ లోటస్ పాండ్ లోనే ఉంటే మంచిదని అన్నారు. కేసీఆర్, మోదీల చేతిలో జగన్ కీలుబొమ్మ అని, కేసులకు భయపడి ఎప్పుడో లొంగిపోయాడని వ్యాఖ్యానించారు. తన జీవితంలో హింసలేదని, ఎవరైనా రౌడీయిజం చేస్తే అణచివేస్తామని హెచ్చరించారు. జగన్ కు ఏమైనా పరిపాలన తెలుసా అని ప్రశ్నించారు.

"జగన్ కు ఏమైనా అనుభవం ఉందా? ప్రతిరోజూ అడుగుతుంటాడు, ఒక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని. ఏంటిది తమ్ముళ్లూ! ప్లీజ్ కేమైనా విలువ ఉందా! ఇదేమన్నా చాక్లెట్టా పోతే పోయిందిలే అనుకుని ఇవ్వడానికి. వంద రూపాయలా అడగ్గానే ఇచ్చేయడానికి. ప్లీజ్ అనగనే కనికరిస్తే మరణవాంగ్మూలాన్ని రాసుకున్నట్టే. మన పిల్లల భవిష్యత్తును పాడుచేసుకుంటామా? ఏదోలే పాపం అని కొందరు అనుకుంటారు, కానీ ఒక్క అవకాశం ఇస్తే బీహార్ అయిపోతుంది" అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

ఇక, కేసీఆర్ పైనా చంద్రబాబు నిప్పులు చెరిగారు. రేపటి ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి మన శక్తేంటో చాటిచెప్పాలని, అప్పుడే టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు అర్థమవుతుందని అన్నారు. మా ప్రజలు అనుకుంటే మిమ్మల్ని చుట్టుముట్టి ఊడ్చిపారేస్తారు తప్ప వదిలిపెట్టరని నిరూపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోనే సెంటిమెంట్ ఉందని కేసీఆర్ భావిస్తున్నాడని, కానీ, 60 ఏళ్ల కష్టాన్ని వదులుకున్న ఏపీ ప్రజలకు ఎంత సెంటిమెంట్ ఉంటుందో తెలుసుకోవాలన్నారు.
Chandrababu
Telugudesam
Jagan
KCR
Narendra Modi

More Telugu News