revanth reddy: నాపై పోటీకి నిలబెట్టడానికి కేసీఆర్ కు అభ్యర్థి కూడా దొరకడం లేదు: రేవంత్ రెడ్డి

  • రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తా
  • రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు
  • ప్రతిపక్షమే లేనప్పుడు.. ఇలాంటి ఎన్నికలు ఎందుకు?

హైదరాబాద్ మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో రేవంత్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈరోజు ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మల్కాజ్ గిరిలో తనపై పోటీకి నిలబెట్టడానికి కేసీఆర్ కు అభ్యర్థి కూడా దొరకడం లేదని అన్నారు. రెండు లక్షల ఓట్ల మెజార్టీతో తాను గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని పాలనను ఊహించలేమని అన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపేందుకు ప్రతిపక్షమే లేనప్పుడు... ఇలాంటి ఎన్నికలను నిర్వహించి ఏం లాభమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరాలనుకోవడానికి గల కారణాలేంటో సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డిలు కార్యకర్తలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News